కొత్తగూడెంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే జిల్లాలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల నమాజ్ కార్యక్రమాలు స్వల్ప ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్టత, మతపరమైన ప్రాముఖ్యతను వివరించారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం చూపిన దైవభక్తి, త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సమాజంలో శాంతి, కరుణ, సోదరభావం పెంపొందించుకోవాలని, ఉన్నదానిలో పేదలకు సహాయం చేయడమే బక్రీద్ పండుగ అసలైన సందేశమని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలు పరస్పరం “ఈద్ ముబారక్” అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment