-->

ముందు కోడి చెరువును ప్రభుత్వానికి అప్పగించండి.. పవన్ కల్యాణ్‌కు కవిత ఘాటు కౌంటర్

ముందు కోడి చెరువును ప్రభుత్వానికి అప్పగించండి.. పవన్ కల్యాణ్‌కు కవిత ఘాటు కౌంటర్

ముందు కోడి చెరువును ప్రభుత్వానికి అప్పగించండి.. పవన్ కల్యాణ్‌కు కవిత ఘాటు కౌంటర్

హైదరాబాద్, జూన్ 6: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వస్తున్న కోడి చెరువు భూముల కబ్జా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. కోడి చెరువు భూమి విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ఆ భూమి చెరువు శిఖం భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదైందని, వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన కవిత, పవన్ కల్యాణ్ తాను ఆక్రమించానని నిరూపితమైతే భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఇరిగేషన్ శాఖ రికార్డుల ప్రకారం కోడి చెరువు పరిధిలోని మొత్తం 10 ఎకరాల భూమి శిఖం భూమిగానే నమోదైందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా, మిగిలిన 7 ఎకరాలను మాగాణి భూమిగా చూపించారని, ఇది ఎలా జరిగిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

“ఇది బరాబర్ మా జాగీరే”

ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ చేసిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అనే వ్యాఖ్యలపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం 1200 మందికి పైగా అమరవీరుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఇది తెలంగాణ ప్రజల సొత్తేనని అన్నారు.

“ఇది పవన్ కల్యాణ్ తాతల, ముత్తాతల జాగీరు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మించలేక ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం సరికాదు” అని విమర్శించారు. తెలంగాణ వనరులు, సంస్కృతి గతంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొంటూ, నైతికతతో రాజకీయాలు చేయాలని సూచించారు.

బీజేపీపై విమర్శలు

తెలంగాణలో బీజేపీకి బలమైన స్థానిక నాయకత్వం లేదని, అందుకే పవన్ కల్యాణ్‌ను ముందుకు తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అలాంటి రాజకీయాలకు తగిన సమాధానం ఇస్తారని అన్నారు.

గద్దర్ అంశంపై ప్రశ్నలు

ప్రజాకవి గద్దర్కు గతంలో కారు కొనిచ్చానని పవన్ కల్యాణ్ చెప్పుకోవడంపై కూడా కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాకారుడికి చేసిన సహాయాన్ని ప్రచారం చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.

అలాగే, పవన్ కల్యాణ్ సినిమాలకు నైజాం ప్రాంతం నుంచే అధిక ఆదాయం వస్తుందని, ఆ లెక్కన ఆయన సంపాదనలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఫోక్ కళాకారులు, చిన్న నిర్మాతలకు ఆయన ఎంతవరకు సహాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

“అప్పుడు.. ఇప్పుడు కూడా KTR పాలనే”

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత పాలనలోనూ వనరుల దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “అప్పుడు KTR అంటే కేసీఆర్, తన్నీరు హరీష్‌రావు, రామారావు పాలన అయితే.. ఇప్పుడు KTR అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి పాలన” అంటూ రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ భూములను విక్రయించడం వల్ల భవిష్యత్ అవసరాలకు భూములు మిగలవని హెచ్చరించిన కవిత, ప్రభుత్వ భూవ్యవహారాలపై పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793