విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు బలి.. అల్వాల్‌లో విషాదం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు బలి.. అల్వాల్‌లో విషాదం
హైదరాబాద్ పాతబస్తీలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రజలు ఇంకా మరచిపోకముందే, నగరంలోని అల్వాల్ పరిధిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అల్వాల్ ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డుపై పడిపోయిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో తండ్రి, కూతురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. మృతులను సందీప్, రితికగా గుర్తించారు. తెగిపడిన విద్యుత్ తీగలు చెట్టు కొమ్మలకు తగిలి ఉండటంతో, వాటిని తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించి, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదకర పరిస్థితులను వెంటనే గుర్తించి నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment