-->

సత్తుపల్లిలో భారీ మోసం బట్టబయలు.. బ్లాక్ మనీ పేరుతో దోపిడీ చేసిన 12 మంది అరెస్ట్

 

సత్తుపల్లిలో భారీ మోసం బట్టబయలు.. బ్లాక్ మనీ పేరుతో దోపిడీ చేసిన 12 మంది అరెస్ట్

సత్తుపల్లిలో భారీ మోసం బట్టబయలు.. బ్లాక్ మనీ పేరుతో దోపిడీ చేసిన 12 మంది అరెస్ట్

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని "బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తాం.. మీరు ఇచ్చిన డబ్బుకు నాలుగు రెట్లు తిరిగి ఇస్తాం" అంటూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వసుంధర యాదవ్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి గత నెల 25న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారంతో జంగారంలో జరుగుతున్న డీల్‌పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా సాగేది మోసం...

ముఠాలోని సభ్యులు మహేందర్ రెడ్డి, బాలగంగాధర్, చంద్రం, చంటిబాబు వంటి పేర్లతో బాధితులకు ఫోన్ చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఆదాయపు పన్ను సమస్యల కారణంగా దానిని వైట్ మనీగా మార్చుకోవాలని చెబుతుండేవారు. "మీరు రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తాం" అంటూ ఆశ చూపించి బాధితులను నమ్మించేవారు.

డీల్ కోసం తమ వ్యక్తిని డమ్మీ 'చిల్డ్రన్స్ కరెన్సీ' నోట్లతో నిండిన బ్యాగ్‌తో పంపించేవారు. బాధితులు నిజమైన నగదు తీసుకొచ్చి లెక్కపెడుతుండగా, మరో బృందం నకిలీ పోలీసుల వేషంలో కార్లలో అక్కడికి చేరుకుని, "మీరు దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్" అంటూ బెదిరించి బాధితుల వద్ద ఉన్న అసలు నగదును ఎత్తుకెళ్లి పరారయ్యేది.

అరెస్ట్ అయిన నిందితులు

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏలూరు జిల్లా కలిదిండి చెందిన చంటిబాబు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన వర్ధన్ (బెటాలియన్ కానిస్టేబుల్), ఏలూరు జిల్లా టీనర్సాపురానికి చెందిన సత్యనారాయణ, గంగారానికి చెందిన కేశవరావు (ఆర్‌ఎస్‌ఐ), మల్లాయిగూడెంకు చెందిన మధు (క్యాబ్ డ్రైవర్), బీరపల్లికి చెందిన గౌతమ్ కుమార్, సదాశివపురానికి చెందిన నవీన్, తుంబూరుకు చెందిన నాగరాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొండగట్టుపల్లికి చెందిన సుబ్బరాజు, సికింద్రాబాద్ ఏఎస్‌రావునగర్‌కు చెందిన శ్రీనివాస్, కర్నూలుకు చెందిన గణేశ్, సత్యసాయి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన జనార్దనరాజు ఉన్నారు. రామాంజనేయులు, రాజు అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

భారీగా స్వాధీనం

నిందితుల నుంచి రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫామ్, సంకెళ్లు, ఒక సూట్‌కేసు, రూ.500 విలువైన డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీ 80 బండిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు ఇలాంటి తప్పుడు హామీలను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, అనుమానాస్పద వ్యక్తులు సంప్రదించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793