చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
"నేను చదువుకోలేను.. చెల్లిని బాగా చదివించండి" అంటూ సూసైడ్ నోట్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. "నేను చదువుకోలేను.. చెల్లిని బాగా చదివించి డాక్టర్‌ను చేయండి" అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండ్లి రాజేందర్, దేవకి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌లో పనిచేస్తుండగా, పెద్ద కుమార్తె చందన (16) వరంగల్ జిల్లా నర్సంపేటలో అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
గురువారం చందన పొగుళ్లపల్లిలోని స్వగ్రామానికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో చదువు ఒత్తిడిని భరించలేకపోతున్నానని, చదువు మానేస్తానని చెప్పగా "అలా చేస్తే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది" అని తల్లిదండ్రులు చెప్పారని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని రాసింది. అంతేకాక, తన చెల్లిని బాగా చదివించి డాక్టర్‌ను చేయాలని, అమ్మా-నాన్న ఇకపై గొడవపడకుండా కలిసి ఉండాలని కూడా ఆ లేఖలో కోరింది.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, విద్యార్థులపై పెరుగుతున్న చదువు ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమనే చర్చకు దారితీసింది.

Post a Comment