ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం 24 గంటల్లోనే నలుగురు అరెస్ట్
కత్తులు, బ్లేడ్లతో ప్రయాణికులను బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన దుండగులు..
విశాఖపట్నం/తుని, జూలై 4: బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఉన్న నలుగురు దుండగులు కత్తులు, బ్లేడ్లతో ప్రయాణికులను బెదిరించి నగదు, సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో కేవలం ఒక్కరోజులోనే నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో నలుగురు యువకులు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. గంజాయి మత్తులో ఉన్న వారు బోగీలోని ప్రయాణికులను బ్లేడ్లు, కత్తులు చూపించి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొన్నారు.
రైలు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకునే సమయంలో వేగం తగ్గగానే నిందితులు రైలు నుంచి దూకి పరారయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికుల నుంచి మొత్తం రూ.30,800 నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం బాధితులు విశాఖపట్నం జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తుని జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్, సీఐబీ సిబ్బందితో కలిసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్‌లు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషిస్తూ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
కాకినాడ రైల్వే లైన్స్ ఇన్‌స్పెక్టర్ టి. శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని విజయవాడ ప్రాంతానికి చెందిన సిందే పౌల్, వనర్జీ పౌల్, సబ్బవరపు సాంబశివరావు, షేక్ రఫీగా గుర్తించారు. వీరిని శనివారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన తుని జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఐబీ సిబ్బంది పనితీరును రాజమండ్రి డీఎస్‌ఆర్‌పీ మెహర్ జయరాం ప్రసాద్ అభినందించారు.

Post a Comment