ముగిసిన కేంద్రం–సీజేపీ చర్చలు.. కేంద్రానికి అల్టిమేటం.. రేపు మధ్యాహ్నం వరకు గడువు
ముగిసిన కేంద్రం–సీజేపీ చర్చలు.. కేంద్రానికి అల్టిమేటం.. రేపు మధ్యాహ్నం వరకు గడువు
నీట్ పరీక్ష వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు, పలు కీలక డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మరియు సీజేపీ (CJP) ప్రతినిధుల మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు కొనసాగిన ఈ చర్చల్లో ఇరువర్గాలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించాయి.
కేంద్ర ప్రభుత్వ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొనగా, సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల భవిష్యత్, నిరసనల నేపథ్యంలో నమోదైన కేసులు వంటి అంశాలు సమావేశంలో ప్రధాన చర్చకు వచ్చాయి.
చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిన తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే, నీట్ లీకేజీ కుంభకోణం కారణంగా తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక పరిహారం అందించాలని కోరారు. అదేవిధంగా, నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించిన విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన పోలీసు కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి రేపు మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
దీంతో రేపు మధ్యాహ్నంలోగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు విద్యార్థుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రం స్పందన ఆధారంగా తదుపరి పరిణామాలు ఉండే అవకాశముంది.

Post a Comment