-->

త్వరలో కృష్ణా నదిపై సోలార్ బోట్లు.. పర్యాటకులకు సరికొత్త అనుభూతి

త్వరలో కృష్ణా నదిపై సోలార్ బోట్లు.. పర్యాటకులకు సరికొత్త అనుభూతి

త్వరలో కృష్ణా నదిపై సోలార్ బోట్లు.. పర్యాటకులకు సరికొత్త అనుభూతి

అమరావతి, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిలో పర్యాటకులకు ఆహ్లాదకరమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించేందుకు డీజిల్ బోట్లకు బదులుగా సోలార్ శక్తితో నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) నిర్ణయించింది.

ఇటీవల జరిగిన ఏపీటీడీసీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సమావేశంలో సోలార్ బోటు నమూనాను సభ్యులకు ప్రదర్శించగా, ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సమృద్ధిగా సూర్యకాంతి లభించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు బోట్లను బెజవాడ డివిజన్‌కు కేటాయించనున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో పర్యాటక సేవల కోసం డీజిల్‌తో నడిచే మెకనైజ్డ్ బోట్లు వినియోగంలో ఉన్నాయి. అయితే డీజిల్ ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం అధికమవుతుండటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన, పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సోలార్ బోట్లను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.30 లక్షలు ఉండగా, సోలార్ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు బోట్ల కొనుగోలుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయం కానుంది.

బోట్ల కొనుగోలు కోసం త్వరలో టెండర్లు లేదా కొటేషన్లు ఆహ్వానించి, నాణ్యమైన బోట్లను తక్కువ ధరకు అందించే సంస్థకు కాంట్రాక్టు కేటాయించనున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే ఒకటి నుంచి రెండు నెలల్లో సోలార్ బోట్లు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

సోలార్ బోట్ల ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇవి డీజిల్ బోట్లతో పోలిస్తే చాలా తక్కువ శబ్దం చేస్తాయి. దీంతో పర్యాటకులు కృష్ణా నది సహజ సౌందర్యాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఆస్వాదించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తమ వంతు సహకారం అందించే అవకాశం కలుగుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో హరిత పర్యాటకానికి కొత్త ఊపు తీసుకురానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793