-->

కుమారుడి కళ్ల ముందే తల్లిపై లైంగిక దాడి తీవ్రంగా గాయపడిన మహిళ

కుమారుడి కళ్ల ముందే తల్లిపై లైంగిక దాడి తీవ్రంగా గాయపడిన మహిళ

కుమారుడి కళ్ల ముందే తల్లిపై లైంగిక దాడి తీవ్రంగా గాయపడిన మహిళ

నారాయణపేట జిల్లా, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వద్ద తన 12 ఏళ్ల కుమారుడితో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం ఆమెను తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఏం జరిగిందంటే..

మక్తల్ పట్టణానికి చెందిన బాధితురాలు కొంతకాలంగా తన 12 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. జీవనోపాధి కోసం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. గత పదేళ్లకు పైగా రాత్రి వేళల్లో మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వద్దే తల్లీకుమారుడు తలదాచుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. నిద్రిస్తున్న మహిళపై వారు లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న కుమారుడు మేల్కొన్నాడు. తల్లిని కాపాడేందుకు బాలుడు ప్రయత్నించగా, నిందితులు అతడిపై కూడా దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో భయపడిన బాలుడు అక్కడి నుంచి పరుగులు తీసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత నిందితులు మహిళపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు తీవ్ర గాయాలతో రక్తస్రావమవుతూ అక్కడే పడిపోయింది.

స్థానికుల సమాచారంతో వెలుగులోకి..

గురువారం తెల్లవారుజామున మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన కొందరు పట్టణ ప్రజలు బాధితురాలి పరిస్థితిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

నిందితుల కోసం గాలింపు

ఘటనపై మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బాధితురాలిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793