ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కారు వద్దే వరుస కాల్పులు
ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కారు వద్దే వరుస కాల్పులు
షామ్లీ: హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బాలియాన్ (32) దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ జిమ్‌లో వ్యాయామం ముగించుకుని బయటకు వచ్చిన అంకిత్‌పై గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ పరిధిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
కారు వద్దే కాల్పుల మోత
సిటీ కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్యపురి నాలా పత్రి సమీపంలో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అంకిత్ బాలియాన్ జిమ్‌లో వర్కవుట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చి తన స్కార్పియో ఎస్‌యూవీ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు ప్రారంభించారు.
డ్రైవర్ సీటు వైపు గోడ అడ్డుగా ఉండటంతో అంకిత్ తప్పించుకునేందుకు కో-డ్రైవర్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దుండగులు కారు డోర్ తెరిచి అత్యంత సమీపం నుంచి వరుసగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తల, కడుపు ప్రాంతాల్లో ఐదు తూటాలు దూసుకెళ్లినట్లు సమాచారం. మరో మూడు తూటాలు కారు ముందు విండ్‌షీల్డ్‌కు తగిలాయి.
కాల్పుల శబ్దంతో స్థానికులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రంగంలోకి ప్రత్యేక పోలీస్ బృందాలు
సమాచారం అందుకున్న వెంటనే మీరట్ జోన్ అదనపు డీజీపీ భాను భాస్కర్, ఎస్పీ ఎం.పీ. సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
జిమ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరిస్తున్నారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, ఎటువైపు పారిపోయారు అనే విషయాలను సీసీటీవీ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
రాజకీయ కక్షల కోణంలోనూ విచారణ
అంకిత్ బాలియాన్‌కు హరియాణాతో ఉన్న సంబంధాలు, గతంలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు, రాజకీయ కారణాలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
షామ్లీ జిల్లా బంటిఖేడా గ్రామానికి చెందిన అంకిత్ బాలియాన్‌కు యూట్యూబ్‌లో 3.66 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. “భరీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్” అనే పాటతో ఆయన విస్తృతంగా గుర్తింపు పొందారు. ఇటీవల జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంకిత్ సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా సాగింది.
అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం
ఈ హత్యపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని విమర్శించారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, రాజకీయ కక్షల కోణం ఉన్నా వెలికితీసి నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్పుల ఘటనకు సంబంధించిన ఆధారాలు, అంకిత్‌కు ఉన్న పాత పరిచయాలు, వివాదాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల అరెస్టుతోనే ఈ హత్య వెనుక అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment