హనుమకొండ కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్–పోలీసుల మధ్య ఉద్రిక్తత
హనుమకొండ కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్–పోలీసుల మధ్య ఉద్రిక్తత
హనుమకొండ: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు.
వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న హరీశ్‌రావును హనుమకొండ కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరీశ్‌రావును కారులో ఎక్కించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను కాలినడకన సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్న ప్రభుత్వం వారికి క్యాష్‌లెస్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
గతంలో ఉద్యోగుల కోరిక మేరకు ఒక శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదించకుండానే కాంట్రిబ్యూషన్‌ను 1.5 శాతానికి పెంచిందని హరీశ్‌రావు ఆరోపించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవడంతో పాటు కుటుంబంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా వారి నుంచి కూడా కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నారని అన్నారు.
అయితే ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ కింద క్యాష్‌లెస్ వైద్యం అందడం లేదని, ప్రభుత్వం ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులతో సరైన ఒప్పందాలు చేసుకోకపోవడంతో ఆసుపత్రులు ఈహెచ్‌ఎస్ కింద చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం, ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీలు ఆసుపత్రులకు గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో ఆసుపత్రులు ఈహెచ్‌ఎస్‌కు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.
పాత వైద్య రీయింబర్స్‌మెంట్, క్యాష్‌లెస్ చికిత్స విధానాలు నిలిచిపోవడంతో పాటు కొత్త ఈహెచ్‌ఎస్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఉద్యోగి కుటుంబ సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈహెచ్‌ఎస్ వర్తించదని చెప్పడంతో సుమారు రూ.11 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. చివరకు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు బిల్లు తగ్గించాల్సి వచ్చిందని చెప్పారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తుంటే వారిపై అక్రమ కేసులు పెట్టి భౌతికంగా వేధించడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించిన హరీశ్‌రావు.. ఈ నిర్ణయం భవిష్యత్తులో కళాశాలలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను మోడల్‌గా తీసుకుంటున్న ప్రభుత్వం, అక్కడ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల నష్టపోయామని వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసి ఉద్యోగులకు వైద్య భద్రత కల్పించాలని కోరారు.

Post a Comment