అర్ధరాత్రి కలకలం.. 300 ఏళ్ల నాటి శివలింగం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు!
అర్ధరాత్రి కలకలం.. 300 ఏళ్ల నాటి శివలింగం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు!
సూర్యాపేట జిల్లా, చివ్వేంల: తిమ్మాపురం గ్రామంలో గుప్తనిధుల కోసం జరిగినట్లు అనుమానిస్తున్న తవ్వకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ తవ్వకాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామం నుంచి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి వెళ్లే మార్గం పక్కన రైతు బాజిరెడ్డి వ్యవసాయ భూమి ఉంది. కొంతకాలం క్రితం భూమిని సాగు చేస్తుండగా సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన శివలింగం బయటపడింది. అప్పటి నుంచి గ్రామస్తులు శివలింగం వద్ద నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
అయితే శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శివలింగం పరిసరాల్లో గుప్తనిధుల కోసం గుంతలు తవ్వినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అక్కడ తవ్వకాలతో పాటు పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని వారు చెబుతున్నారు.
గుర్తుతెలియని వ్యక్తుల సంచారం
గత కొన్ని నెలలుగా గ్రామంలో అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగిన విషయాన్ని బయటకు రాకుండా ఉంచడంపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పురాతన శివలింగం వద్ద తవ్వకాలు జరగడం ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించాలని వారు కోరుతున్నారు. పురాతన శివలింగం పరిసరాలను రక్షించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment