గణేష్ మండపంలో పూజలు చేస్తూ కుప్పకూలిన పూజారి.. మృతి
గణేష్ మండపంలో పూజలు చేస్తూ కుప్పకూలిన పూజారి.. మృతి
నల్గొండ జిల్లా: గణేష్ ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం విషాదానికి దారితీసింది. గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహిస్తున్న పూజారి ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో కలకలం రేపింది. మృతుడిని దత్తు ప్రసాద్‌గా గుర్తించారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం గ్రామంలోని గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించే విషయంలో దత్తు ప్రసాద్‌తో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ముందుగా తమ మండపం వద్ద పూజలు నిర్వహించాలంటూ ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం.
ఈ క్రమంలో దత్తు ప్రసాద్ గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయనను సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో చింతలపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాగ్వాదం జరిగిన అనంతరం పూజారి కుప్పకూలి మృతి చెందడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాగ్వాదానికి, దత్తు ప్రసాద్ మృతికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందా? లేక ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారా? అనే విషయం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాగ్వాదానికి దారితీసిన పరిస్థితులు, అందులో పాల్గొన్న వ్యక్తులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పూజారి మృతికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. నివేదిక, దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment