తెలంగాణ రక్షణ సేనలోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి పలువురు సర్పంచులు, నాయకుల చేరిక
తెలంగాణ రక్షణ సేనలోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి పలువురు సర్పంచులు, నాయకుల చేరిక
అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 13: కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా దేవాలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
నాగోబా ఆలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కల్వకుంట్ల కవిత పేర్కొంటున్న నేపథ్యంలో మేస్రం ఆనందరావు చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం తనకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమని కవిత చెబుతున్నారు. మేస్రం ఆనందరావు వంటి ప్రముఖుడు పార్టీలో చేరడంతో ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్‌రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణ తదితరులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ రక్షణ సేన నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభకు మంచి స్పందన లభించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని నాయకులు చెబుతున్నారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడంగల్ సభ అనంతరం ఇంద్రవెల్లి బహిరంగ సభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇంద్రవెల్లి సభ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను మరింత చైతన్యపరచాలని నాయకత్వం భావిస్తోంది.
ముఖ్యంగా ఆదివాసీలు, గోండులు, బంజారా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పార్టీలోకి ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీ రాజకీయ విస్తరణకు మరింత ఊపునివ్వాలని తెలంగాణ రక్షణ సేన నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment