హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఐదు ట్రావెల్స్ బస్సులు!
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఐదు ట్రావెల్స్ బస్సులు!
బౌరంపేటలోని పార్కింగ్ యార్డులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో వ్యాపించిన అగ్నికీలలు.. ప్రమాదానికి కారణంపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: నగర శివార్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట బొడ్రాయి సమీపంలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదు ట్రావెల్స్ బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటల్లో ఐదు బస్సులు
పార్కింగ్ యార్డులో ఒకదాని పక్కన మరొకటి నిలిపి ఉంచిన బస్సుల్లో తొలుత ఒక బస్సుకు మంటలు అంటుకున్నాయి. అనంతరం మంటలు వేగంగా ఇతర బస్సులకు వ్యాపించడంతో మొత్తం ఐదు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఐదు బస్సులు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదమా? కావాలనే తగలబెట్టారా?
ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బస్సులు పార్కింగ్ చేసిన తర్వాత ఈ ఘటన జరగడంతో ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Post a Comment