హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి మృతి
హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి మృతి
సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందినట్లు అనుమానం
హైదరాబాద్: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) క్యాంపస్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి మృతి చెందాడు. కూకట్‌పల్లిలోని గౌతమ్ బాయ్స్ హాస్టల్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన విక్రమ్ బాబు (19)గా గుర్తించారు. జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ క్రమంలో హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హాస్టల్ అధికారులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. పరీక్షల ఫలితాలే ఘటనకు కారణమా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. విక్రమ్ బాబు మృతితో హాస్టల్‌లో, యూనివర్సిటీ పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి అకాల మరణంతో తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Post a Comment