నల్గొండలో రేపు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం
నల్గొండలో రేపు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం
**ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్**
**నల్గొండ:** నల్గొండ నియోజకవర్గ స్థాయి చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ శుక్రవారం పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులతో కలిసి ఏచూరి గార్డెన్‌ను సందర్శించి కార్యక్రమ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమానికి హాజరయ్యే పింఛన్ లబ్ధిదారుల కోసం తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని, అవసరమైన చోట హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మండలాలు, డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అర్హులైన లబ్ధిదారులకే పింఛన్లు అందేలా చూడాలని, అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.
ఈ పర్యటనలో శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment