ఒకే తల.. రెండు శరీరాలు.. ఎనిమిది కాళ్లు! భోగాపురంలో వింత గొర్రె పిల్ల జననం
ఒకే తల.. రెండు శరీరాలు.. ఎనిమిది కాళ్లు! భోగాపురంలో వింత గొర్రె పిల్ల జననం
**చూసేందుకు ఆసక్తి చూపుతున్న స్థానికులు.. జన్యుపరమైన లోపాలే కారణమంటున్న పశువైద్యాధికారి**
**భోగాపురం:** ప్రకృతి వింతకు నిదర్శనంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీ పరిధిలో ఒకే తల, రెండు శరీరాలు, ఎనిమిది కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. ఈ వింత జననం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కేశవ కల్లాలు సమీపంలో అలబాని బంగారికి చెందిన గొర్రె ఆదివారం తొలి కాన్పులో ఈ వింత గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. సాధారణ గొర్రె పిల్లలకు భిన్నంగా ఒకే తలతో రెండు శరీరాలు, ఎనిమిది కాళ్లు ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అరుదైన గొర్రె పిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు అక్కడికి చేరుకుని వింత గొర్రె పిల్లను తిలకిస్తున్నారు.
జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటి అరుదైన శరీర నిర్మాణంతో జననాలు సంభవించే అవకాశం ఉందని పశువైద్యాధికారి తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం భోగాపురం పరిసర ప్రాంతాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Post a Comment