ఖమ్మం కోర్టులోని ఎస్సీ, ఎస్టీ కేసులు కొత్తగూడెంకు బదిలీ
ఖమ్మం కోర్టులోని ఎస్సీ, ఎస్టీ కేసులు కొత్తగూడెంకు బదిలీ
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.. ఇకపై జిల్లా కేసుల విచారణ కొత్తగూడెం కోర్టులోనే
**కొత్తగూడెం:** ఖమ్మం కోర్టులో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ (SC/ST) కేసులను కొత్తగూడెంకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణను కొత్తగూడెంలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు కేటాయించారు.
ఈ నిర్ణయంతో జిల్లాకు చెందిన కక్షిదారులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ కోసం ఖమ్మం కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కక్షిదారులు ఖమ్మం వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే కేసుల విచారణకు హాజరయ్యే అవకాశం కలిగింది. దీనివల్ల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు కేసుల విచారణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు తగ్గనున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొత్తగూడెం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సానుకూల నిర్ణయం వెలువడటం సంతోషకరమన్నారు.
గత నెలలో జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ సుజనాను హైకోర్టులో కలిసి ఈ సమస్యపై వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన కేవలం 16 రోజుల్లోనే సమస్యను పరిష్కరించి, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణను కొత్తగూడెం కోర్టుకు కేటాయించేలా చర్యలు తీసుకున్నందుకు హైకోర్టు న్యాయమూర్తికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యగా నిలుస్తుందని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

Post a Comment