ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్!
ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్!
క్యాబ్ డ్రైవర్ ముసుగులో కల్తీ మద్యం దందా.. జానీ వాకర్, డ్యూవార్స్ పేరుతో చౌక మద్యం విక్రయం
శంషాబాద్‌లో డీటీఎఫ్ పోలీసుల దాడులు.. 10 ఫుల్ బాటిళ్లు, 30కి పైగా ఖాళీ సీసాలు స్వాధీనం
హైదరాబాద్: ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరు వందల రూపాయలు పెట్టి కొంటున్న మద్యం అసలైనదో, నకిలీదో ఒకసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో చౌకబారు మద్యాన్ని విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న ముఠా గుట్టును గ్రేటర్ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ ముసుగులో సాగుతున్న ఈ అక్రమ మద్యం దందాపై శంషాబాద్ పరిధిలో దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
చౌక మద్యాన్ని ఖరీదైన బ్రాండ్ల పేరుతో విక్రయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అక్రమ వ్యాపారానికి వంగలి అశోక్ (43) ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో బగ్గా డిస్టిలరీ మద్యం తయారీ పరిశ్రమలో పనిచేసిన అతడికి మద్యం మిక్సింగ్ విధానాలపై అవగాహన ఉంది. అక్కడ పని మానేసిన అనంతరం క్యాబ్ డ్రైవర్‌గా మారిన అశోక్.. శంషాబాద్ సమీపంలోని శాతమ్ రాయి ప్రాంతంలో తన నివాసంలోనే నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టాడు.
మహమ్మద్ యాకూబ్ పాషా (29) నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణం నుంచి ఖరీదైన మద్యం బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాలను సేకరించేవాడు. వాటిని శుభ్రం చేసి తిరిగి వినియోగిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
రూ.560 మద్యం.. వేల రూపాయల బ్రాండ్ బాటిళ్లలో!
రూ.560 విలువ చేసే 'డౌన్ టెన్' అనే చౌక మద్యాన్ని జాన్ వెల్స్, జానీ వాకర్, డ్యూవార్స్, 100 పైపర్స్ వంటి ఖరీదైన బ్రాండ్ల ఖాళీ బాటిళ్లలో నింపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పాత బాటిళ్ల మూతలను తొలగించి, వాటిలో చౌక మద్యం నింపి తిరిగి కొత్త బాటిళ్ల మాదిరిగా సిద్ధం చేసేవారు.
అనంతరం ఈ నకిలీ మద్యం బాటిళ్లను తమకు పరిచయమున్న రెగ్యులర్ కస్టమర్లకు అసలైన బ్రాండ్ల మద్యంగా నమ్మించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కానిస్టేబుల్ సమాచారంతో దందా గుట్టురట్టు
ఈ అక్రమ మద్యం వ్యాపారంపై అనుమానం వచ్చిన కానిస్టేబుల్ ధనుంజయ్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సీఐ నరేందర్ నేతృత్వంలోని డీటీఎఫ్ బృందం పక్కా సమాచారంతో శంషాబాద్ పరిధిలోని అశోక్ నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో మిక్సింగ్ చేసిన 10 ఫుల్ మద్యం బాటిళ్లతో పాటు 30కి పైగా ఖాళీ బ్రాండెడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అశోక్‌తో పాటు ఖాళీ బాటిళ్లు సరఫరా చేస్తున్న స్క్రాప్ దుకాణం యజమాని మహమ్మద్ యాకూబ్ పాషాను అరెస్ట్ చేశారు.
పది మంది కస్టమర్లపైనా విచారణ
నిందితులిద్దరితో పాటు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ నకిలీ మద్యాన్ని స్థానికంగా సుమారు పది మంది రెగ్యులర్ కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో వారికి కూడా ఈ వ్యవహారంలో ఉన్న సంబంధాలపై అధికారులు విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఆపరేషన్‌లో సీఐ నరేందర్, ఇన్ఛార్జ్ సీఐ భరత్ కుమార్, ఎస్సైలు హనుమంతు, నజీర్ పాషాతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ మద్యం తయారీ, విక్రయ ముఠాను పట్టుకున్న గ్రేటర్ హైదరాబాద్ డీటీఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. బ్రాండెడ్ బాటిల్ కనిపిస్తే చాలు.. అసలైన మద్యమేనని నమ్మి కొనుగోలు చేయడం ప్రమాదకరమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Post a Comment