మీర్పేట్లో దారుణ హత్య.. రక్తపు మడుగులో మహిళ మృతదేహం
మీర్పేట్లో దారుణ హత్య.. రక్తపు మడుగులో మహిళ మృతదేహం
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లోనే ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్ తన భార్య అనిత (35), పిల్లలతో కలిసి జిల్లెలగూడ దత్తునగర్లో నివాసం ఉంటున్నారు. శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్-Aలోని మూడో అంతస్తులో గత నాలుగేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. అరుణ్ కుమార్ మిదాని (కేంద్ర ప్రభుత్వ సంస్థ)లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం (నవంబర్ 11) పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి అనిత రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పిల్లలు వెంటనే తండ్రి అరుణ్ కుమార్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు అనితను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అనిత హత్యకు గల కారణాలు ఏమిటి? ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా కనిపించడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Post a Comment