మంత్రాల నెపంతో రెండు హత్యలు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడి మరో ఇద్దరి మృతి!
మంత్రాల నెపంతో రెండు హత్యలు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడి మరో ఇద్దరి మృతి!
భద్రాద్రి కొత్తగూడెం: మూఢనమ్మకాలు, మంత్రాల పేరుతో సాగిన అనుమానాలు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వృద్ధులను హత్య చేసిన ఘటన మరువకముందే, అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మణుగూరు ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో పద్దం మాసయ్యతో పాటు మరో వృద్ధుడిని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యలతో మాసయ్య కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. తమను కూడా దుండగులు చంపేస్తారనే భయంతో మాసయ్య కుమారుడు రాంబాబు, కోడలు సునీత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇద్దరూ విషపదార్థం కలిగిన పానీయాన్ని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ సునీత నిన్న ప్రాణాలు కోల్పోగా, రాంబాబు నేడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఒకే కుటుంబంలో నాలుగు మరణాలు..
ఇప్పటికే ఇద్దరు వృద్ధుల హత్యలతో విషాదంలో ఉన్న కుటుంబంలో రాంబాబు, సునీత మరణాలు మరింత విషాదాన్ని నింపాయి. మంత్రాల నెపంతో జరిగిన రెండు హత్యల అనంతరం భయాందోళనలతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటనలో మొత్తం నాలుగు మరణాలు చోటుచేసుకున్నాయి.
నిరాధారమైన అనుమానాలు, మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment