మురుగు కాలువలో పసికందు మృతదేహం.. వీధి కుక్కలు లాగడంతో వెలుగులోకి దారుణం!
మురుగు కాలువలో పసికందు మృతదేహం.. వీధి కుక్కలు లాగడంతో వెలుగులోకి దారుణం!
కాగజ్నగర్: కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే ఓ పసిప్రాణం అనంతలోకాలకు చేరింది. అప్పుడే జన్మించిన నవజాత శిశువు మృతదేహం మురుగు కాలువలో కనిపించడం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కన్నవారే వదిలేశారా? లేక మరేదైనా కారణంతో ఈ ఘటన చోటుచేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో గురువారం ఉదయం ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది. గ్రామ శివారులోని మురుగు కాలువ సమీపంలో వీధి కుక్కలు ఓ కవర్ను లాగుతుండటాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. అనుమానం రావడంతో దగ్గరకు వెళ్లి పరిశీలించగా, ఆ కవర్లో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కనిపించింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో చింతలమానేపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి, పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామంలోకి వచ్చే మార్గాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పసికందును అక్కడ పడేసిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
అప్పుడే జన్మించిన పసికందు మృతదేహం ఇలా మురుగు కాలువలో కనిపించడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన వెనుక అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Post a Comment