బడ్జెట్‌పై (2024-2025) ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పెదవి విరిచారు.
బడ్జెట్‌పై (2024-2025) ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పెదవి విరిచారు.
దిల్లీ: కేంద్రం వెలువరించిన బడ్జెట్‌పై (2024-2025) ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పెదవి విరిచారు. ఇది ప్రజామోదమైన బడ్జెట్ కాదని, కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని విమర్శించారు. అందుకే కేంద్రంలో కీలకంగా మారిన బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, మిగతా రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎన్డీయే ఈ బడ్జెట్‌ను రూపొందించిందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అందుకే అత్యధిక పార్లమెంట్ సభ్యులు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా నిరాశే ఎదురైందన్నారు.
‘‘ ఎన్డీయే ప్రవేశ పెట్టిన 11వ బడ్జెట్ ఇది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌నే తీసుకుంటే.. రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ నేతలంతా పెద్ద పెద్ద నెంబర్ల గురించి మాట్లాడుతుంటారు. కానీ, వారు చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తికాదు. గత పదేళ్లుగా నిరుద్యోగాన్ని సృష్టించి... ఇప్పుడు ఆ సమస్యను పారద్రోలుతామంటున్నారు. చిన్నా చితకా ఉద్యోగాలు ఇచ్చి.. ‘మమ’ అనిపించాలనుకుంటున్నారు. కానీ, యువతకు కావాల్సింది స్థిరమైన ఉద్యోగాలు’’ అని అఖిలేశ్ అన్నారు.
కేంద్రం చేసిన నైపుణ్య శిక్షణ ప్రకటనతో భాజపా ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఎత్తివేసినట్లయిందని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేసి బడ్జెట్ రూపొందించారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ‘‘ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లోక్‌సభ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా చదివి వినిపించడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల హామీని కాపీ కొట్టారు. ఇలా చాలా అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలోనివే.’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దశదిశ లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. రాజకీయంగా ప్రేరేపితమైందని ఆరోపించారు. చీకట్లో వెలుగు నింపేలా బడ్జెట్‌లో తనకెలాంటి అంశం కనిపించలేదని అన్నారు. 2024-25 బడ్జెట్ ప్రజలకు, పేదలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు.

Post a Comment