విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా, వెకిలి చేష్టలు కీచక టీచర్
విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా, వెకిలి చేష్టలు కీచక టీచర్
*ఇల్లందు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ప్రస్తుత సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఇల్లందు పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా, వెకిలి చేష్టలు చేశాడు. ఇదే ఉపాధ్యాయుడు గత విద్యా సంవత్సరంలో సైతం ఇలానే వ్యవహరించడంతో హెచ్ఎం అప్పటి ఐటీడీఏ పీఓ, ఐటీడీఏ డీడీ, ఇల్లందు ఏటీడీఓ లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా మొదటి తప్పుగా పరిగణలోకి తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే పాఠశాలలో కొనసాగించారు.
మరలా ఇలానే వ్యవహరిస్తున్నారని విద్యార్థినిలు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎం పిలిచి సదరు ఉపాధ్యాయుని వివరణ కోరారు. తన వల్ల మరలా తప్పు జరగదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలిపారు. ఇంతలో విద్యార్థినిల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్య నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినితో డబుల్ మీనింగ్ మాటలు, ఇష్టానుసారంగా కొట్టడం, కావాలనే తగలరాని చోట తాకడం వంటి వెకిలి చేష్టలతో తాము ఎంతో ఇబ్బందులు పడ్డామని, ఇంకా చెప్పుకోలేని విధంగా మాట్లాడేవారని కంటతడి పెట్టుకున్నారు. సమాచారం పోలీసులకు తెలియడంతో ఇల్లందు ఎస్ఐ పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉండగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఆ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడిని కాపాడేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై సీఐ బత్తుల సత్యనారాయణని వివరణ అడగగా ఆ ఉపాధ్యాయునిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Post a Comment