-->

సినిమా డైలాగులు వద్దు, అసెంబ్లీలో లెక్కలు చెప్తాం: సీఎం రేవంత్ రెడ్డి

 

సినిమా డైలాగులు వద్దు, అసెంబ్లీలో లెక్కలు చెప్తాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ప్రసంగించిన ఆయన, గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుబట్టారు.

"2023 నాటికి తెలంగాణ రాష్ట్రం రూ. 7 లక్షల కోట్ల అప్పుతో నిండిపోయింది. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇది పూర్తిగా వడ్డీలకే సరిపోయింది. అయితే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశాం," అని వివరించారు.

అసెంబ్లీలో రికార్డులతో మాట్లాడటానికి సిద్ధమని ప్రకటించిన సీఎం, "సినిమా డైలాగులు వద్దు కేసీఆర్! నీకు నిజంగా ధైర్యం ఉంటే ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వచ్చి అసెంబ్లీలో నిలబడి మాట్లాడు. రైతుల రుణమాఫీపై మా లెక్కలు తీసుకుని వస్తాం, నువ్వు కూడా నీ లెక్కలు చెప్పు," అంటూ సవాల్ విసిరారు.

దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి హామీలను విస్మరించిన కేసీఆర్‌ను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్టీ డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు.

"పదేళ్ల పాలనలో రైతుల పట్ల అన్యాయం చేసిన కేసీఆర్, అసెంబ్లీ ఎన్నికల నెపంతో రైతు బంధు నిధులను నిలిపివేశారు. కానీ, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే రైతులకు బకాయి భరోసా నిధులను జమచేశాం. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే. కానీ, మేం ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశాం," అని వివరించారు.

కేసీఆర్ నిజంగా రైతుల కోసం పని చేస్తే అసెంబ్లీలో హాజరై తన హామీలు, నిధుల వివరాలు వెల్లడించాలని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. "మేం చేసిన రుణమాఫీ లెక్కలు సిద్ధంగా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో రా... ప్రజల ముందు నిజం చెప్పు," అంటూ సూటిగా ప్రశ్నించారు.

Blogger ఆధారితం.