-->

భోగి పండ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారు?

 

భోగి పండ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారు?

తెలుగు ప్రజలు జరుపుకొనే ప్రముఖ పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండుగను నాలుగు రోజులపాటు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, కోడి పందాలు, రథముగ్గులు, ఇలా సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకమైన ఆనందమయం వాతావరణం కనిపిస్తుంది.

ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా, రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా, చివరి రోజును 'ముక్కనుమ'గా పిలుస్తారు. భోగి పండుగ రోజు నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువులు వేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతారు. ఈ రోజున బొమ్మల కొలువు పెట్టడం, ముత్తైదువులతో పేరంటాలు చేయడం వంటి ప్రత్యేక సంప్రదాయాలు పాటిస్తారు.

భోగి పండ్ల సంప్రదాయం:

భోగి పండుగ రోజు సాయంత్రం చిన్నారుల తలపై రేగిపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వేసే సంప్రదాయం ఉంది. కొంతమంది శనగలు కూడా కలుపుతారు. ఈ ఆచారానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. రేగిపండ్లు (బదరీఫలం) పిల్లల తలపై పోస్తే శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని, వారి మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని నమ్ముతారు. భోగిపండ్లను తలపై పోస్తే, తల భాగంలోని బ్రహ్మరంధ్రం ప్రేరేపితం అవుతుందని, దీని ద్వారా పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం.

పురాణ కథల ప్రకారం, నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారి తలపై బదరీఫలాలను కురిపించారు. దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను తలపై పోసే సంప్రదాయం ప్రబలిందని చెబుతారు.

భోగి పండుగ ప్రాధాన్యత:

భోగి ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశిస్తాడు. ఈ సంధి క్షణం కొత్త ఉజ్వల జీవితానికి సంకేతంగా భావిస్తారు. సంక్రాంతి పండుగ సూర్యభగవానుడి పూజకు సంబంధించినదిగా ఉన్నందున, సూర్యుణ్ని పోలిన గుండ్రటి రూపం, ఎర్రటి రంగు కలిగిన బదరీఫలాన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు.

ఈ ఆచారం పిల్లలు 12 ఏళ్ల లోపువారికి మాత్రమే చేస్తారు, వీరికి సూర్యనారాయణుడి కృప లభించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793