ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రక్రియ ప్రారంభం..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదనలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ఈనెల 26న ప్రభుత్వ పథకాల అమలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేదలకు ఇళ్ల పంపిణీ వంటి కీలక పథకాల అమలు పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకాలు పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చర్యల కారణంగా ఎన్నికలలో ప్రభావం పడతాయన్న అభిప్రాయం స్థానిక నేతలలో వ్యక్తమవుతోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. దీని ప్రభావంతో కొత్త పథకాల అమలు లేదా అనుమతులు నిలిచిపోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటోంది. పథకాల అమలు పూర్తికాకపోతే, ఎన్నికలను ఏప్రిల్ లేదా మేకు వాయిదా వేయవచ్చని సమాచారం. ఈ సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని అంచనా.
ఇక ఎన్నికల నేపథ్యంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతుండగా, అధికార పార్టీ కూడా తన విజయాన్ని సురక్షితం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజలు ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post a Comment