తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు
తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, అందుకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తప్పు తెలియక చేసినా, తెలిసి చేసినా అది తప్పేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై మొదటగా ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమిషనర్ గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్‌లను బదిలీ చేశారు. ఈ ఘటనకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ రమణకుమార్‌తో పాటు గోశాల ఇంచార్జ్‌ను సస్పెండ్ చేశారు. జ్యూడిషియల్ విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామని, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా, 33 మంది గాయపడిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, తిరుమల పవిత్రతను కాపాడడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు.
ఆరోపణలు – వైసీపీ స్పందన
ఈ దుర్ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఈ ఘటనను వినియోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

Post a Comment