బీబీనగర్ మండల తహసీల్దార్ శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు
బీబీనగర్ తహసీల్దార్ సస్పెన్షన్ – కలెక్టర్ చర్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల తహసీల్దార్ శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆయన విధి నిర్వహణలో తప్పిదాలకు పాల్పడ్డారనే కారణంతో ఈరోజు సస్పెండ్ చేశారు.
ఎందుకు సస్పెండ్ చేసారు?
బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్‌లో ప్లాట్లు ఉన్నప్పటికీ, ఆయా స్థలాలను పరిశీలించకుండా తహసీల్దార్ పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా నకిలీ పాస్‌బుక్స్ జనరేట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్, తహసీల్దార్ శ్రీధర్ బాధ్యతారహితంగా వ్యవహరించారని నిర్ధారించి, ఆయనపై సస్పెన్షన్ విధించారు.
రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు
కేవలం బీబీనగర్ కేసు మాత్రమే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవలి కాలంలో రెవెన్యూ శాఖలో అక్రమాలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. మోతే మండలం తహసీల్దార్ సంఘమిత్ర సహా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI), మీ సేవ నిర్వాహకులు పహాణీ టాంపరింగ్ కేసులో సస్పెండ్ అయ్యారు. అంతేకాకుండా, పోలీసు కేసులు నమోదై రిమాండ్‌కు వెళ్లారు.
ఈ సంఘటనలతో, జిల్లాలో రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. అధికారులపై మరింత నిఘా ఉంచాలని, దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల రక్షణకు కఠిన నిబంధనలను అమలు చేస్తామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment