గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ పారిశ్రామికవాడ పరిసరాల్లో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న సర్కార్ పార్ధు అనే వ్యక్తిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 205 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ గోపాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా 205 గ్రాముల గంజాయి బయటపడిందని తెలిపారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలను అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా, సేవిస్తున్నా, రవాణా చేస్తున్నా, పోలీసులకు సమాచారం అందించాలని సీఐ గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఎస్సై బాలయ్య, హెడ్ కానిస్టేబుళ్లు చంద్రయ్య, ఎల్లయ్య సహా సిబ్బంది రాజు, నరేష్, రవి, హరీష్, నవీన్ పాల్గొన్నారు.

Post a Comment