సరస్వతి పుష్కరాలు: కాళేశ్వరం ఘాట్ వద్ద కొనసాగుతున్న భక్తుల రద్దీ (వీడియో)
పవిత్ర సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. శనివారంతో పుష్కరాలు ప్రారంభమైన 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది.
శనివారం ఉదయం నుంచే వేలాదిమంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు చేరుకున్నారు. గోదావరి, ప్రణహిత, సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర స్థలంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఘాట్ ప్రాంతం సందడిగా మారింది.
ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి సంగమ ఘాట్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటుండటంతో ఏవైనా అపాయాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ప్రమాదకరంగా ఉన్న గదులు లేదా లోతైన ప్రవాహాల వైపు భక్తులు వెళ్లకుండా ఉండేలా కేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇక అధికారులు, వాలంటీర్లు, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఘాట్ వద్ద భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు కూడా పుష్కర ఘాట్ వద్ద అమలులో ఉన్నాయి.
పుష్కరాల ముగింపు వరకు భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Post a Comment