💥 హనుమకొండ జిల్లాలో దారుణ హత్య.. డబ్బుల గొడవే ప్రాణం తీసింది
హనుమకొండ జిల్లాలో ఘోర హత్య కలకలం రేపింది. డబ్బుల వ్యవహారమే ఒక యువకుని ప్రాణాలు తీసింది. రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న నవీన్ కుమార్ అనే యువకుడు, తన మిత్రుడు అయిన గడ్డం ప్రవీణ్ కుమార్తో మధ్యాహ్నం సమయంలో మాటామాటా పెంచుకున్నాడు. వారి మధ్య రూ. 40,000 లు అప్పుగా ఇచ్చిన అంశంపై వాదన తలెత్తింది.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ప్రస్తావించిన ప్రవీణ్.. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై తన వెంట ఉన్న కత్తితో నవీన్ కుమార్‌పై దాడి చేశాడు. కత్తితో ప్రాణాంతకంగా పొడవడంతో నవీన్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు.
ఈ దారుణ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాజీపేట పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం నవీన్ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Post a Comment