ఎస్సీ కులాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: హక్కుల పోరాట సమితి డిమాండ్
కొత్తగూడెం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కులాల హక్కులకు సంబంధించిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సింగరేణిలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది. సమావేశానికి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రెవంత్ రెడ్డి హామీ అమలు చేయాలి
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కులాల కోసం జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల్లో స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని బొమ్మెర శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ హామీని పాటించకపోవడం అన్యాయమని, రాబోయే 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో 2014 నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఎస్సీలు అన్యాయం
ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా జనరల్ కేటగిరీలో కలపడం పూర్తిగా అన్యాయం, అవమానం అని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షలాది మంది ఎస్సీలు నివసిస్తున్నప్పటికీ, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు నిరాకరించడం శోచనీయమన్నారు. అనాధలుగా చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
పునర్విభజనలో రెండు ఎస్సీ అసెంబ్లీ స్థానాలు
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ప్రతి ఏజెన్సీ జిల్లాకు కనీసం రెండు ఎస్సీ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలను గిరిజనులతో సమానంగా అభివృద్ధి చేయాలని సమితి స్పష్టం చేసింది.
సమావేశంలో పాల్గొన్న నాయకులు:
- ఎనగంటి కృపాకర్ – రాష్ట్ర కోఆర్డినేటర్
- గోదా రమేష్, కర్లపూడి సుందర్ పాల్, దూడపాక శివప్రసాద్, ఉండేటి దేవరాజ్,
- బల్లెం ప్రకాశం, ఎనగంటి శ్రీనివాస్, శేఖర్, నాగరత్నం తదితరులు హాజరయ్యారు..
Post a Comment