రైతుబంధు డబ్బుల విషయంలో ఘోర దాడి – తండ్రి నాలుక కోసేసిన కొడుకు!
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మానవత్వాన్ని మరిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. రైతుబంధు డబ్బుల విషయంలో తండ్రి నాలుకను కోసేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఊరికి చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. తాజాగా రైతుబంధు పథకం కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ.6,000 లు అతని ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బు కోసం ఆయన చిన్న కొడుకు సంతోష్ తరచూ తండ్రిని డిమాండ్ చేస్తుండగా, కీర్యా ఆరోగ్య సమస్యల వల్ల రూ.2000 ఖర్చు చేశానని, మిగిలిన రూ.4000 త్వరలో ఇస్తానని చెప్పాడు.
అయితే ఈ మాటలు నచ్చని సంతోష్, ఆగ్రహంతో మానవత్వాన్ని వదిలిపెట్టి తన తండ్రి కీర్యాపై దాడికి దిగాడు. మొదట అతన్ని కొట్టిన అనంతరం, ఇంట్లో ఉన్న గొడ్డలితో కీర్యా నాలుకను కోసేశాడు. ఈ దాడితో తీవ్రంగా రక్తస్రావం చెందిన కీర్యాను కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ దుర్మార్గ ఘటనపై స్పందించిన కీర్యా భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నైతికత కోల్పోతున్న సమాజాన్ని దుయ్యబట్టారు.
Post a Comment