వాణిజ్య సంస్థలలో ఇకపై 10 గంటల పనిదినం – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని వేళలకు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల శ్రమను గౌరవిస్తూ, “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు మరింత గతి ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయవచ్చు.
- అయితే వారం మొత్తం పని సమయం 48 గంటలు మించకూడదు.
- 48 గంటలకు మించి పని చేయించాలంటే, ఓవర్‌టైమ్ వేతనం తప్పనిసరిగా చెల్లించాలి.
- ఆరు గంటల పని అనంతరం ఉద్యోగికి కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాల్సిందే.
- విశ్రాంతి సమయంతో కలిపి పన్నెండు గంటలకు మించి ఎవరినీ పని చేయించరాదు.
ప్రభుత్వం ఈ చర్యలు ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదని తెలిపింది. కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా పని సమయాల్లో సరళీకరణ చేసుకోవచ్చు గానీ, ఉద్యోగుల శ్రేయస్సుకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
ఈ నూతన నిబంధనలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు, వాణిజ్య రంగంలో పారదర్శకత, సమర్థత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సమాచారం.
Post a Comment