-->

అనిల్ అంబానీ గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు – రూ.3వేల కోట్ల మనీలాండరింగ్‌ ఆరోపణలు

అనిల్ అంబానీ గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు – రూ.3వేల కోట్ల మనీలాండరింగ్‌ ఆరోపణలు


ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై దర్యాప్తు సంస్థలు పెను గుదులుబండిని ప్రారంభించాయి. గురువారం సాయంత్రం ముంబై, ఢిల్లీ సహా 35 ప్రాంతాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. అంబానీ గ్రూప్‌కు చెందిన 50కి పైగా కంపెనీలు, 25 మంది వ్యక్తుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.

ఈ సోదాలు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 కింద చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఈడీ ఆరోపణల ప్రకారం, 2017 నుంచి 2019 మధ్యకాలంలో యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ రూ.3వేల కోట్ల వరకు రుణాలు తీసుకుని, వాటిని ఇతర కంపెనీలకు మళ్లించారు.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లు, సెబీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఈడీ దాడులు నిర్వహించింది.

ఈడీ ప్రాథమిక విచారణలో యస్ బ్యాంక్‌ రుణాల ప్రాసెసింగ్‌లో తీవ్రమైన లోపాలు, అనేక షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు, సరైన డాక్యుమెంటేషన్ లేకుండానే రుణాల మంజూరు, లోన్ ఎవర్‌గ్రీనింగ్ వంటి అవకతవకలు జరిగినట్లు తేలింది.

ప్రభుత్వ రంగ నియంత్రణ సంస్థ అయిన సెబీ తెలిపిన వివరాల ప్రకారం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు 2018లో రూ.3,742 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణాలు 2019 నాటికి రూ.8,670 కోట్లకు పెరిగాయి. ఈ నిధులలో భాగంగా యస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు భారీగా డబ్బులు బదిలీ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో క్వో ఒప్పందం (లాభాల మార్పిడి ఒప్పందం) ఉండొచ్చని ఈడీ భావిస్తోంది.
ఇది రిలయన్స్ గ్రూప్ ఆర్థిక స్థితిపై గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Blogger ఆధారితం.