మహత్త్వ నిర్ణయం: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సీఎం రేవంత్
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక తీర్మానం చేపట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైకోర్టు సూచించిన మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన అవసరం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానానికి గత మార్చిలోనే శాసనసభ ఆమోదం తెలిపిందని, అనంతరం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించబడిన విషయాన్ని మంత్రివర్గం గుర్తు చేసింది.
ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొత్తం 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష జరిగింది. ఇప్పటివరకు తీసుకున్న 327 నిర్ణయాల్లో 321 అమలయ్యాయని, మిగిలిన 6 నిర్ణయాలపై అవసరమైన వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇకపై ప్రతి రెండు వారాలకు ఒకసారి మంత్రివర్గం సమావేశం కావాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రంలోని 306 గోశాలల నిర్వహణకు సంబంధించి సమగ్రమైన పాలసీని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
అంతేగాక, చివరి దశలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు మీడియాకు వెల్లడించారు.
Post a Comment