71 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం – 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గింపు
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థాయిగల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు GHMC, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలవడంతో 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.
పూర్వంలో ఉన్న 5,817 ఎంపీటీసీ స్థానాలకుపోయి ఇప్పుడు 5,773 మాత్రమే మిగిలాయి. అలాగే, ప్రస్తుతం 566 ఎంపీపీలు, 566 జెడ్పీటీసీలు ఉన్నాయి.
ఇందుకు తోడు, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న పలు గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనమవడంతో ఒక జిల్లా పరిషత్ (జెడ్పీ) స్థానం తగ్గిపోయింది. ఫలితంగా, గత ఎన్నికల నాటికి 32 జెడ్పీలు ఉండగా, ఇప్పుడు 31 జిల్లాలకే జెడ్పీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇంద్రేశం, జిన్నారం – కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటుకు కసరత్తు
తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను మున్సిపాలిటీలుగా ప్రకటించడానికి ప్రక్రియ మొదలైంది. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 18 గ్రామ పంచాయతీలు ఉండనున్నాయి. ఇవి కలిసిన తర్వాత మళ్లీ ఎంపీటీసీ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశముంది.
ఈ మార్పుల్ని అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి డీనోటిఫికేషన్, మున్సిపల్ శాఖ నుంచి నోటిఫికేషన్ అవసరం. ఇప్పటికే ఇరు శాఖలూ కసరత్తు ముమ్మరం చేశాయి.
గ్రామ పంచాయతీల సంఖ్యలో స్వల్ప తగ్గుదల
2019లో రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుత సంఖ్య 12,759కి తగ్గింది. అయితే ఇటీవల నల్గొండ జిల్లా హలియా మున్సిపాలిటీలోని ఒక పంచాయతీని డీనోటిఫైడ్ చేయడంతో, తాజా సంఖ్య 12,760కి చేరే అవకాశం ఉంది.
అలాగే, గ్రామాల్లో ఉన్న వార్డుల సంఖ్య 1,13,136 నుండి 1,12,500కి తగ్గింది. పంచాయతీల మున్సిపాలిటీల్లో విలీనమే దీనికి కారణమైంది.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా పంచాయతీరాజ్ శాఖ
ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ప్రకటన వెలువడితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పీఆర్ఎస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితమైన సంఖ్యలతో డీలిమిటేషన్, షెడ్యూల్ ప్రకటించే పనిలో ఉన్నారు.
Post a Comment