జలదిగ్భంధంలో ఏడు పాయల అమ్మవారి ఆలయం (వీడియో)
మెదక్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడు పాయల అమ్మవారి ఆలయం వరద జలాల ముట్టడిలో చిక్కుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు సింగూర్ ప్రాజెక్టు నుంచి అధికారులు ఐదు గేట్లను ఎత్తేయడంతో నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.
ఈ వరద జలాలు ఆలయం ప్రాంగణంలోకి చేరి గర్భగుడి వరకు ప్రవేశించాయి. అమ్మవారి పాదాలను తాకేంత వరకు నీళ్లు చేరడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఆలయంలో జరిగే దైనందిన కైంకర్యాలు వరద కారణంగా నిలిచిపోయాయి. అయితే రాజగోపురం వద్ద ఉన్న ఉత్సవ విగ్రహానికి యథావిధిగా పూజలు నిర్వహిస్తున్నారు.
ఏడు పాయల ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మికంగా విశిష్టత సాధించిన దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ప్రస్తుతం ఆలయం జలదిగ్భంధంలో ఉండటంతో భక్తుల రాక తగ్గింది. అధికారులు వరద నీరు తగ్గే వరకు భక్తులు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లరాదని సూచనలు జారీ చేశారు.

Post a Comment