టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె
మలుపు తిరుగుతున్న సినీ కార్మికుల సమ్మె!
హైదరాబాద్, టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. మొదట వేతనాల పెంపు డిమాండ్‌తో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు కొత్త షరతులు, ఇగో సమస్యలతో మరింత సంక్లిష్టమైంది. మొన్న లేబర్ కమిషన్ సమక్షంలో రెండు వర్గాలు కూర్చున్నా—చివరికి సంధి కుదరలేదు.
30 శాతం జీతం పెంపుపై చర్చలు మొదలైన ఈ వివాదం, నాలుగో రోజుకే ముగుస్తుందనుకున్నా, వివిధ విభాగాల మధ్య సమన్వయం కుదరక ఆరో రోజుకి చేరింది. ముఖ్యంగా డ్యాన్సర్లు, ఫైటర్స్‌లో లోకల్ – నాన్ లోకల్ నియామకాల రేషియో విషయంలో ఏకాభిప్రాయం రాలేదు.
ఈ నేపథ్యంలో, “నో మోర్ షూటింగ్స్” అంటూ ఫిల్మ్ ఛాంబర్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అవుట్‌డోర్ యూనిట్లు, స్టూడియోలలో ఎలాంటి షూటింగ్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
ఫిల్మ్ ఛాంబర్ – ఫిల్మ్ ఫెడరేషన్ కోఆర్డినేషన్ సమావేశానికి ముందు, సినీ కార్మికుల నాయకుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ—“మా డిమాండ్లపై సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం” అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మి రాజు కూడా కార్మిక సంఘాలతో సమావేశం తర్వాతే యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని చెప్పారు.
శనివారం నిర్మాతలు, కార్మికులు వేర్వేరుగా సమావేశమై భవిష్యత్ దారిని చర్చించారు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న—ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరు బెట్టువిడతారు?
మొత్తం మీద, కోట్లాది రూపాయల బిజినెస్ తిరిగే తెలుగు సినీ పరిశ్రమలో ఈ ప్రతిష్ఠంభన ఎప్పుడు తొలగుతుందన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది.
Post a Comment