పెద్దపల్లి కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం
పెద్దపల్లి: జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. తనకు ఉద్యోగం ఇవ్వకపోవడంతో మానసిక వేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. సతీష్ తండ్రి కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలో పాము కాటుకు గురై మృతి చెందాడు. అప్పటి నుంచి తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని సతీష్ పలుమార్లు అధికారులను అభ్యర్థించాడు.
అయితే తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో సతీష్ తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎదుటే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అక్కడే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.
ఈ ఘటనతో కలెక్టరేట్‌లో ఒకసారిగా కలకలం చెలరేగింది. సతీష్‌ను తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment