నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం త్వరలో ప్రారంభం కానున్న ఆధునిక కర్మాగారం
రూ.300 కోట్ల వ్యయంతో 62 ఎకరాల్లో నిర్మాణం
టెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ నిర్మించబడింది. 2022 ఏప్రిల్ 13న అప్పటి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు కలిసి భూమిపూజ నిర్వహించారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసి తక్కువ సమయంలోనే నిర్మాణ పనులను పూర్తి చేశారు.
రైతులకు లాభదాయకం
జిల్లాలో 13,420 ఎకరాల్లో సాగు చేసిన 4,051 మంది రైతులు ఇప్పటికే పంట దిగుబడిని అందుకున్నారు. ఇప్పటివరకు 820 మంది రైతులు 2,350 టన్నుల గెలలను అమ్మి దాదాపు రూ.4 కోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. రైతుల పొలాల నుంచి ఫ్యాక్టరీ వరకు రవాణా ఖర్చును ఆయిల్‌ఫెడ్ భరిస్తుండటం రైతులకు ఊరట కలిగిస్తోంది.
అత్యాధునిక సాంకేతికత
- గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యంతో ప్రారంభమై, భవిష్యత్తులో గంటకు 120 టన్నుల వరకు పెంచుకునే సౌకర్యం.
- భారతదేశంలోనే ఈ స్థాయి సామర్థ్యం కలిగిన తొలి ఫ్యాక్టరీగా నిలవబోతోంది.
- క్రూడ్ పామాయిల్ మిల్లు, పామ్ కెర్నల్ ఆయిల్ మిల్లు, రిఫైనరీ, కో-జనరేషన్ విద్యుత్తు ప్లాంట్, వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు.
- నాలుగు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం.
- 10 కోట్ల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్.
- మూడు వేబ్రిడ్జీలు, ప్రహారీ గోడ, పరిపాలన భవనం తదితర సౌకర్యాలు సిద్ధం.
సమీప జిల్లాలకు కూడా ఉపయోగం
భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీ సిద్దిపేటతో పాటు జనగామ, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి–భువనగిరి జిల్లాల నుంచి వచ్చే ఆయిల్‌పామ్ గెలలను కూడా ప్రాసెస్ చేయనుంది.
హరీశ్‌రావు సంతోషం
ఫ్యాక్టరీ ట్రయల్ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. “కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ కర్మాగారం రైతుల కలలను నిజం చేస్తోంది. బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆయిల్‌పామ్ రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం” అని హరీశ్‌రావు అన్నారు.

Post a Comment