-->

మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో 449 అద్దె బస్సులు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!

మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో 449 అద్దె బస్సులు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!


హైదరాబాద్ | డిసెంబర్ 01: తెలంగాణలో ఆర్టీసీకి అద్దె బస్సులు సమకూర్చే కార్యక్రమం మహిళా స్వయం సహాయక సంఘాలకు వరంగా మారింది. ఇప్పటికే నడుస్తున్న 154 బస్సులతో మహిళా స్వయం సహాయక సంఘాలకు తొలి నెలలోనే రూ. 1 కోటికి పైగా ఆదాయం లభించింది. ఈ విజయంతో ఉత్సాహం చెంది, ప్రభుత్వం ‘ఇందిర మహిళ శక్తి పథకం’ క్రింద మహిళలకు మరిన్ని స్థిర ఆదాయ అవకాశాలు కల్పించేందుకు అడుగులు వేస్తోంది.

సెర్ఫ్ (SERP) ద్వారా మహిళా సంఘాలకు అందించిన పొదుపు–రుణాల సహకారంతో బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం మే 20 నుండి మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన మొత్తం 154 అద్దె బస్సులు ఆర్టీసీ తరఫున రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.

తాజాగా, ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి నాగిరెడ్డికి లేఖ పంపారు. మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహణకు అనుకూలంగా మరో 449 కొత్త అద్దె బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆ లేఖలో వెల్లడించారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు లభించగానే ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

మహిళలకు స్థిర మరియు దీర్ఘకాలిక ఆదాయ వనరులు సృష్టించడమే ఇందిర మహిళ శక్తి పథక ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు రవాణా రంగంలో స్వయం సంసిద్ధత సాధించటమే కాకుండా, గ్రామీణ కుటుంబాలకు ఆర్థికంగా కొత్త ఆశలు నింపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793