-->

ఇద్దరి మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

త్రాగిన మైకంలో ప్రమాదం.. ఇద్దరి మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష


కొత్తగూడెం లీగల్, మార్చి 9: మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అదనంగా రూ.1,000 జరిమానా కూడా విధించారు.

కేసు వివరాల ప్రకారం… భద్రాచలం పట్టణానికి చెందిన తోట వెంకటరమణ (57) కుటుంబ సభ్యులతో కలిసి 2020 జనవరి 1న పామీలేరు ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా బూర్గంపాడు మండలం పూల్లేరు వాగు వద్ద ఆయన చిన్న కుమార్తె తోట చంద్రకళ (28) హోండా యాక్టివా (AP 20 AN 3337) పై తన కుమార్తె వడ్డే శ్రీ లాస్య (5)కు మఫ్లర్ కట్టేందుకు రోడ్డుపక్కన వాహనాన్ని ఆపింది.

అదే సమయంలో ప్రభాస్ శంకర్ హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్ (TS 28 T 5195) డ్రైవర్ ఆకుల దుర్గాప్రసాద్ (32) మద్యం మత్తులో ప్రమాదకరంగా వాహనం నడుపుతూ వచ్చి రోడ్డుపక్కన నిలిపి ఉన్న స్కూటీని ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో స్కూటీ కొంత దూరం వెళ్లి చెట్టుకు తాకింది. ఘటనలో తోట చంద్రకళ, చిన్నారి శ్రీ లాస్య అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై వెంకటరమణ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్సై బి. బాలకృష్ణకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అనంతరం పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పి. నవీన్, జి. సత్యనారాయణ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.

కోర్టులో మొత్తం 14 మంది సాక్షులను విచారించిన అనంతరం అంబులెన్స్ డ్రైవర్ ఆకుల దుర్గాప్రసాద్‌పై నేరం రుజువవడంతో కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, బూర్గంపాడు పీసీ మహమ్మద్ అక్రమ్ తదితరులు సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793