జాతీయ లోక్ అదాలత్ విజయవంతం మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. నీలిమ
సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహణ
మెదక్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ జి. నీలిమ సూచనలతో మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొన్నారు. కక్షిదారులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, రాజీ మార్గాన్ని ఎంచుకొని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు.
రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని, లోక్ అదాలత్ ద్వారా కేసులు సులభంగా, వేగంగా పరిష్కారమవుతాయని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఐదు బెంచ్‌లు పనిచేస్తాయని రుబీనా ఫాతిమా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది లక్ష్మణ్ కుమార్, ఇతర న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment