వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ హెచ్చరిక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌కు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, డిసెంబర్ 21: హైదరాబాద్ నగర ప్రజలకు, ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులకు పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా విస్తరిస్తున్న “ఘోస్ట్ పేయిరింగ్” అనే కొత్త రకమైన స్కామ్‌పై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?” లేదా “ఇది నువ్వేనా?” అంటూ వచ్చే సందేశాల్లో ఉన్న లింకులను, అవి ఎవరివైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సీపీ స్పష్టం చేశారు.
సాధారణంగా మనకు తెలిసిన వారి పేరు, ప్రొఫైల్ ఫోటో (DP) కనిపించగానే నమ్మేసే మనస్తత్వాన్ని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా సందేశాలన్నీ “ఘోస్ట్ పేయిరింగ్” స్కామ్‌లో భాగమేనని వెల్లడించారు.
ఘోస్ట్ పేయిరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది?
- లింక్‌ను ఓపెన్ చేస్తే నకిలీ WhatsApp Web లాగిన్ పేజీ తెరుచుకుంటుంది
- అందులో వివరాలు ఎంటర్ చేస్తే యూజర్ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది
- తర్వాత హ్యాకర్లు అదే అకౌంట్ ద్వారా ఇతరులకు మెసేజ్‌లు పంపి డబ్బులు అడిగి మోసాలకు పాల్పడుతున్నారు
సీపీ సజ్జనార్ కీలక సూచనలు:
- అనుమానాస్పద లేదా తెలియని లింకులను ఎప్పటికీ క్లిక్ చేయవద్దు
- తెలిసిన వ్యక్తి నుంచి వచ్చినా ముందుగా కాల్ చేసి నిర్ధారించుకోవాలి
- అకౌంట్ హ్యాక్ అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇవ్వాలి
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు మరింత చాకచక్యంగా మారుతున్నాయని సీపీ పేర్కొన్నారు. డిజిటల్ భద్రత ఇప్పుడు వ్యక్తిగత భద్రతతో సమానమని, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.

Post a Comment