-->

భద్రాచలంలో పట్టపగలే హత్య.. నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి యువకుడి హత్య

భద్రాచలంలో పట్టపగలే హత్య.. నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి యువకుడి హత్య


భద్రాచలం | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో పట్టపగలే జరిగిన హత్య కలకలం రేపింది. చర్ల రోడ్డులోని వైన్స్ షాపుల సమీపంలో ప్రధాన రహదారిపై ప్రజలు చూస్తుండగానే కొందరు యువకులు ఒక వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

స్థానికుల సమాచారం ప్రకారం, రవి వర్మ అనే వ్యక్తిపై ఆకస్మికంగా దాడికి పాల్పడిన యువకులు వరుసగా కత్తిపోట్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీదే కుప్పకూలిన రవి వర్మను అక్కడున్న వారు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దాడి చేసిన యువకులు సంఘటన అనంతరం ఎలాంటి భయాందోళన లేకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. నడిరోడ్డుపై ఇలా హత్య జరగడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉండగా, వ్యక్తిగత కక్షలా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో భద్రాచలం పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793