శ్మశానంలో సగం కాలిన శవం.. అస్తికల వద్ద వింత ఆనవాళ్లు.. గ్రామంలో భయాందోళన
జగిత్యాల, డిసెంబర్ 17: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ యువతి మృతికి సంబంధించి శ్మశానవాటికలో కనిపించిన వింత ఆనవాళ్లు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశాయి.
మోతె గ్రామానికి చెందిన యువతి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ నెల 12న ఇంట్లో పురుగుల మందు తాగిన ఆమెను కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న ఆమె మృతి చెందింది. అనంతరం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, గ్రామంలోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేశారు.
అయితే మరుసటి రోజు కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు వెళ్లగా, మృతదేహం పూర్తిగా దహనం కాకుండా సగమే కాలినట్లు గుర్తించారు. దీంతో మళ్లీ కర్రలు వేసి దహన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసిన చోట ఉన్న అస్తికలను తీసుకెళ్లినట్లు, అక్కడ క్షుద్రపూజలు చేసినట్లుగా వింత ఆకారాలు, ఆనవాళ్లు కనిపించాయి.
ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువతికి మంత్రాలు చేయడం వల్లే మృతి చెందిందన్న అనుమానంతో మంగళవారం రాత్రి గ్రామంలో రెండు డప్పులు, కర్రలతో “మంత్రాలు వాపస్ తీసుకోవాలి” అంటూ డప్పుల చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గ్రామస్తులను విస్మయానికి గురి చేయగా, గ్రామమంతా భయాందోళన వాతావరణం నెలకొంది.
ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Post a Comment