కారు బీభత్సం.. తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్/రంగారెడ్డి, డిసెంబర్ 17: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దుర్గానగర్ చౌరస్తా వద్ద అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి రగ్గుల షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యూపీకి చెందిన తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ప్రభు మహారాజ్, ఆయన కుమారుడు దీపక్‌గా పోలీసులు గుర్తించారు. మరో కుమారుడు సత్తునాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు బౌన్సర్లు ఉన్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, బౌన్సర్లు శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్ ముగించుకుని కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. బౌన్సర్లంతా సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Post a Comment